తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన ముగ్గురు వారసులు తమ తండ్రులు తమకు బలమైన రాజకీయ వేదిక ఇచ్చినా కూడా దానిని నిలబెట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మరో సీనియర్ నేత కుతూహలమ్మ ఈ ముగ్గురు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే. వీరిలో గాలి, కుతూహలమ్మ కాంగ్రెస్ నుంచి టీడీపీకి జంప్ చేసిన వారే. వీరు ముగ్గురు 2014 ఎన్నికల తర్వాత తప్పుకుని తమ వారసులకు రాజకీయం అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు వారసులు చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితులే ఉన్నాయి.
శ్రీకాళహస్తిలో బొజ్జల మంత్రిగా ఉన్నప్పుడే ఆయన తనయుడు సుధీర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఆ నియోజకవర్గం టీడీపీకి ఇంకా చెప్పాలంటే బొజ్జల ఫ్యామిలీకి కంచుకోట. ఆయన గత ఎన్నికల్లో అనారోగ్యంతో పోటీ చేయలేక తప్పుకున్నారు. సుధీర్‌రెడ్డి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయాక నియోజకవర్గాన్ని వదిలేసి పూర్తిగా హైదరాబాద్‌కు పరిమితం కావడంతో కేడర్ గగ్గోలు పెడుతోంది. ఇక నగరిలో మరో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రోజా చేతిలో ఓటమి పాలయ్యారు. గాలి ఒకప్పుడు చిత్తూరు జిల్లానే శాసించినా నగరిలో టీడీపీపై భాను పట్టు దొరకడం లేదు. ఆయన తిరుపతికే పరిమితం అవుతున్నారు.
పైగా ఇప్పుడు నగరిలో రోజా స్ట్రాంగ్‌గా ఉన్నారు. భాను మరింతగా కష్టపడాలి. అయితే గాలి ఫ్యామిలీ రెండుగా చీలిపోవడం కూడా ఆయనకు మైనస్ అయ్యింది. ఇక గంగాధర నెల్లూరులో సీనియర్ నేత గుమ్మడి కుతూహలమ్మ వారసుడు హరికృష్ణ పూర్తిగా పార్టీని వదిలేసి… కాలం కలిసొస్తే మళ్లీ పోటీ చేద్దాం.. లేకపోతే కండువా మార్చేద్దాం అన్నట్టుగా ఉన్నారట. కుతూహలమ్మ ఎంతో సీనియర్. ఒకప్పుడు వైఎస్ సీటు ఇవ్వకపోతే ఢిల్లీ వెళ్లి మరీ సోనియాను కలసి సీటు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె తప్పుకుని తన తనయుడికి సీటు ఇప్పించినా గెలిపించకోలేకపోయారు. ఏదేమైనా ఈ ముగ్గురు టీడీపీ వారసుల రాజకీయానికి తండ్రులు బలమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసినా వీరు మాత్రం మైదానంలో ప్లాప్ అయ్యారనే చెప్పాలి.