ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం.. పులి దాడి వ్యక్తి మృతి

-

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో విషాదం జరిగింది. పత్తి పంట వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేయడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని గోందాపూర్‌ గ్రామంలో ఫారెస్టు, పంచాయతీ అధికారులు, గ్రామానికి చెందిన కమిటీ సభ్యులు, పలువురు రైతులు పోడు భూముల సర్వే కోసం వెళ్లారు. పోడు భూముల సర్వే కోసం అధికారులు తన చేనుకు వస్తున్నారని భావించిన చౌపాన్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీం (69) అనే రైతు కూడా వారి వెంట వెళ్లారు. పక్కనే తన సొంత పొలంలో వేసిన పత్తిపంటను చూసేందుకు పొలంలోకి వెళ్లగా అక్కడే మాటు వేసిన పులి ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అటవి, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిన్న భీంపూర్ మండలంలో గుంజాల సమీపంలో ఆవుపై దాడి చేసి చంపాయి. వారం క్రితం చెనాక కొరటా పంప్ హౌస్ సమీపంలో 2 పులులు కనిపించాయి. ఇవాళ వాంకిడి మండలం ఖానాపూర్ లో పులి రైతుపై దాడి చేసి చంపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. పులులను పట్టుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version