శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మే నెల అంగప్రదక్షిణ టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మరోవైపు తిరుమలలోని టీటీడీ జేఈవో కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని తిరిగి బుధవారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రోజుకు 750 టికెట్లను జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు రోజుకు 150 టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తారు.
మార్చి నుంచి ప్రతి రోజు జారీ చేసే వెయ్యి శ్రీవాణి టికెట్లలో… 500 టికెట్లను ఆన్‌లైన్‌లో, 400 టికెట్లను గోకులం అతిథిగృహం(జేఈవో) కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో, వంద టికెట్లను రేణిగుంట విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తారు. శ్రీవాణి టికెట్లను ఆఫ్‌లైన్‌లో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు నేరుగా జారీ చేస్తామని జేఈవో కార్యాలయ సూపరింటెండెంట్ అజయ్‌కుమార్ వెల్లడించారు.