తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో రికార్డయ్యింది. 2019లో తిరుపతిలో 78 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి 58శాతానికి పరిమితమైంది. 5 లక్షల మెజారిటీపై అధికార పార్టీ వైసీపీ కన్నేస్తే.. రేస్‌లో ముందు రావాలని టీడీపీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో పాటు టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది.
గెలుపు తమదే అంటున్న వైసీపీ మెజార్టీ పై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది. 2019 ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీ..ఈసారి రేస్‌లో ముందుకు రావాలని ప్రయత్నించింది. ఈ రెండు పార్టీలను కాదని తమకు పట్టం కట్టాలని జనసేనతో కలిసి పోరాడింది బీజేపీ. 2019 ఎన్నికల్లో వైసీపీకి 7 లక్షల 22 వేల పైచిలుకు ఓట్లు, టీడీపీకి 4 లక్షల 94 వేల ఓట్లు వచ్చాయి. నాడు వైసీపీకి వచ్చిన మెజారిటీ 2 లక్షల 28 వేలు. 2019 ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోల్చుకుంటే వైసీపీ, టీడీపీ, బీజేపీలకు గతానికంటే ఓట్లు తగ్గే అవకాశం కనపడుతుంది.
కరోనా భయం,వేసవి కాలం కావడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.మరోవైపు వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించిందని టీడీపీ నేతలు ఆరోపించారు.తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్ల పరిధిలో ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో నాడు టీడీపీకి తిరుపతి ఒక్కటే కాపు కాసింది. మిగతా ఆరుచోట్లా వైసీపీదే ఆధిక్యం. ఇప్పుడు ఏడుకు ఏడుచోట్ల వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ సరళిని భట్టి ఓటింగ్ లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది జగన్ సంక్షేమపథకాల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
పోల్ మేనేజ్ మెంట్,మనీ మేనేజ్ మెంట్ విషయంలో కూడా వైసీపీ సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. టీడీపీ,బీజేపీ ఆ విషయంలో మాత్రం వెనుకడుగు వేసి ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి. అధికారపార్టికి ఉండే సౌలభ్యం పైగా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జగన్ పై ఉన్న సానుకూలత దృశ్య వైసీపీకే విజయవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.