నేడు ఐపీఎల్‌లో రసవత్తరపోరు.. రాజస్థాన్‌ వర్సెస్‌ బెంగళూరు..

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022 చివరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు లీగ్‌ ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గని బెంగళూరుతో తలపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న ఈ పోరులో గెలిచిన జట్టు.. ఆదివారం జరుగనున్న మెగావార్‌లో టైటిల్‌ కోసం గుజరాత్‌ను ఢీ కొట్టనుంది. తమ చిరకాల కల నెరవేర్చుకునేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండడుగుల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు.. శుక్రవారం క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడి రాజస్థాన్‌ కాస్త డీలా పడితే.. లక్నోపై ఘన విజయంతో బెంగళూరు జోరుమీదుంది. ఇతర జట్ల గెలుపోటములతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన బెంగళూరు.. ఎలిమినేటర్‌లో సమిష్టిగా సత్తాచాటింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ విఫలమైన వేళ.. రజత్‌ పాటిదార్‌ చేలరేగి విధ్వంసం సృష్టించాడు.

లక్నో బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు సిక్సర్లతో ఈడెన్‌ గార్డెన్స్‌లో అజేయ శతకంతో విశ్వరూపం కనబర్చాడు. అతడి దూకుడుకు దినేశ్‌ కార్తీక్‌ మెరుపులు తోడవడంతో ఆర్‌సీబీ భారీ స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విరాట్‌, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ కూడా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరిస్తే బెంగళూరుకు తిరుగుండదు. మరోవైపు టాపార్డర్‌ బలంతో నిలకడగా విజయాలు సాధిస్తూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్‌.. గత మ్యాచ్‌లో మంచి స్కోరే చేసినా.. గుజరాత్‌ హిట్టర్లను అడ్డుకోవడంలో విఫలమై మూల్యం చెల్లించుకుంది. జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌ మంచి టచ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుండగా.. బౌలింగ్‌లో రాజస్థాన్‌ కంటే బెంగళూరే మెరుగ్గా కనిపిస్తున్నది.

తుది జట్లు (అంచనా)

బెంగళూరు: డుప్లెసిస్‌ (కెప్టెన్‌), కోహ్లీ, పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌, లోమ్రర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్షల్‌, హసరంగ, హజిల్‌వుడ్‌, సిరాజ్‌.రాజస్థాన్‌: శాంసన్‌ (కెప్టెన్‌), బట్లర్‌, జైస్వాల్‌, పడిక్కల్‌, హెట్‌మైర్‌, పరాగ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మెక్‌కాయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version