నేడు దేశవ్యాప్తంగా బంద్.. పాల్గొననున్న 40 వేల వాణిజ్య సంఘాలు

-

పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ సవరణలకు వ్యతిరేకంగా.. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించనుంది. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం ఐట్వా రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండాలని.. 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ గురువారం ప్రకటించారు. బంద్‌ను విజయవంతం చేయడానికి లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం పాల్గొననున్నాయని ఆయన వెల్లడించారు.

Bharat Bandh

పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి. ఈ బంద్‌లో లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొననున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్రం చెప్పిన విధంగా జీఎస్టీని అమలు చేయడం లేదని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. దీనివల్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇదే విషయాన్ని దేశంలోని అనేక వ్యాపార సంఘాలు 200 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఫిబ్రవరి 22న ప్రధాని మోదీకి మెమొరాండం పంపాయని తెలిపారు.

జీఎస్టీ నియమాలను పున:పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పెరుగుతున్న పెట్రో ధరలు కూడా సామాన్యులకు గుదిబండగా మారాయని తెలిపారు. పెట్రో ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. అయితే ఈ రెండు సంఘాల కింద వందల సంఖ్యలో యూనియన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బంద్‌కు ఏ మేరకు స్పందన లభిస్తుందన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version