నిన్నటి వరకు సామాన్యుడికి చుక్కలు చూపించిన టొమాటో ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. వారం క్రితం మార్కెట్ లో కిలో రూ. 150 పలికిన టొమాటో నేడు రూ. 50 లోపే లభిస్తోంది. దీంతో సామాన్యులకు ఊరట కలిగింది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు టొమాటో రేట్లు ఒక్కసారిగా ఆకాశానంటాయి. సామాన్యుడు కిలో టొమాటో కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూర్, కడప, నెల్లూర్, అనంతపురం జిల్లాల్లో భారీగా వరదలు వచ్చాయి. దీంతో టొమాటో పంట సాగు దెబ్బతింది. దిగుబడి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు, కర్ణాటకకు మదనపల్లి మార్కెట్ నుంచే పెద్ద ఎత్తున టొమాటో ఎగుమతి అవుతోంది. వరదల కారణంగా టొమాటో ఎగుమతులు చాాలా వరకు తగ్గాయి. దీంతో డిమాండ్ పెరిగి సప్లై తగ్గింది. ఫలితంగా ధరలు కిలో టొమటోకు రూ. 100 దాటి 150కి చేరింది.
ఇటీవల ఉత్తర భారత దేశం నుంచి టొమాటో దిగుమతులు పెరగడంతో క్రమంగా టొమాటో ధరలు దిగి వచ్చాయి. వారం వ్యవధిలో ఉత్తర భారతం నుంచి తెలుగు రాష్ట్రాలకు దిగుమతులు పెరగడంతో టొమాటో రేట్లు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో టొమాటోలు రూ. 38 కే లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్కెట్లలో టొమాటో ధరలు కిలోకు రూ. 50 లోపే ఉన్నాయి.