ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్‌తోపాటు పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు తెలిపి ట్వీట్లు చేసిన విషయం విదితమే. అయితే జనవరి 26వ తేదీన ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన అల్లర్ల అనంతరం ఒక్కసారిగా వారు తెరపైకి వచ్చారు. ఆ తరువాత గ్రెటా థన్‌బర్గ్ ఓ ట్వీట్ చేయడం.. అందులో టూల్ కిట్ ప్రస్తావన ఉండడం.. వంటి అంశాల వల్ల ఈ విషయం మరింత దుమారం రేపుతోంది. అయితే ఇంతకీ అసలు టూల్‌కిట్ అంటే ఏమిటి ? అంటే..
సాధారణంగా ఏదైనా అంశంపై ఆందోళన చేయాల్సి వచ్చినా, వేరే ఏవైనా కార్యక్రమాలను నిర్వహించదలుచుకున్నా, ఇతర అంశాలపై కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఇంకా ఏవైనా సరే.. కార్యకర్తలు, అందులో పాల్గొనే యాక్టివిస్టులు ఒక డాక్యుమెంట్‌ను రూపొందిస్తారు. అందులో తమ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి సమాచారంతో ఉంటాయి. కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహిస్తారు ? ఏం చేయాలి ? సహాయం ఎలా అందుతుంది ? ఫోన్ నంబర్లు, వాట్సాప్ గ్రూప్‌లు వంటి సామాజిక మాధ్యమాల వివరాలు.. తదితర పూర్తి సమాచారంతో డాక్యుమెంట్‌ను రూపొందిస్తారు. దాన్నే టూల్ కిట్ అంటారు. ఆ టూల్ కిట్‌ను కార్యక్రమం చేపట్టడానికి కొద్ది రోజుల ముందే షేర్ చేస్తారు. దీంతో అది అందరికీ చేరుతుంది. ఫలితంగా ఎక్కువ మంది కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా టూల్‌కిట్‌ను రూపొందించారు. నిజానికి అది కార్యకర్తల అంతర్గత వ్యవహారం. అది సాధారణంగా బయటకు రాదు. కానీ గ్రెటా థన్‌బర్గ్ పొరపాటున తన ట్వీట్‌తో ఆ టూల్‌కిట్ డాక్యుమెంట్‌ను షేర్ చేసింది. తరువాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ క్రమంలో ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగిన ఆందోళనలకు ఆ టూల్‌కిట్టే కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఇప్పటికే గ్రెటాపై కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశంతో సంబంధం ఉందని చెబుతూ ముంబైకి చెందిన యాక్టివిస్టు దిశ రవి, ఆమె స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయట పడుతుండడం ఈ అంశం పట్ల మరింత దుమారాన్ని రేపుతోంది.