గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త స్కెచ్

-

తెలంగాణలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త ప్యూహానికి పదును పెడుతుంది. ఇప్పటికే నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ అభ్యర్దిగా పల్లా పేరును ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇక మరో స్థానం హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్‌ కొత్త ప్యూహానికి పదును పెట్టిందట..ఇక్కడ అభ్యర్ధిని సైతం ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టిన గులాబీదళం కొత్త ప్యూహాన్ని అమలు చేయబోతుందట…

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూల్‌ విడుదల చేసింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా మళ్లీ బరిలో దిగి ప్రచారంపై ఫోకస్‌ పెట్టారు. ఆ మూడు జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక స‌మావేశాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం రోజుకో స‌మావేశం ఏర్పాటు చేసి ప్రచారంలో బిజీగా ఉంటున్నారు ప‌ల్లా. మరో ఎమ్మెల్సీ స్థానం హైద‌రాబాద్-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి గ్రాడ్యుయేట్‌ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ నోరు మెద‌ప‌డం లేదు.

షెడ్యూల్ వ‌చ్చి ప్రధాన పార్టీలు అభ్యర్దులని నిలబెట్టినా త‌మ‌కు సంబంధం లేదన్నట్టే వ్యవహ‌రిస్తోంది టీఆర్ఎస్. తొలుత ఇక్కడ ఎవ‌రు పోటీ చేయాల‌న్నదాని పై కొంద‌రి పేర్లు తెర‌ పైకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదట. గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి టిఆర్ఎస్ త‌ర‌ఫున ఉద్యోగుల సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేసి బీజేపీ నేత రామ‌చంద్రరావు చేతిలో ఓడిపోయారు.

గతంలో ఈ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి మరోసారి ఓటమి పాలైన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఈ దఫా వామపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వచ్చినా లెఫ్ట్‌ పార్టీల నుంచే బరిలో దిగారు. ప్రశ్నించే గొంతును గెలిపించండి అని సమావేశాలు పెడుతున్నారు నాగేశ్వర్. అయితే.. ఈ స్థానంలో బీజేపీ ఓట‌మి కోసం అంత‌ర్గతంగా నాగేశ్వర్‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని టీఆర్ఎస్ ఆలోచిస్తోందట. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంద‌ని..తాము గెల‌వ‌లేకున్నా బీజేపీ మాత్రం గెలవొద్దని టీఆర్ఎస్ ఆలోచిస్తోందట.

కొన్నాళ్ల క్రితం ప్రొఫెసర్‌ నాగేశ్వర్ రైతు చ‌ట్టాల‌పై సీఎం కేసిఆర్‌తో భేటీ అయ్యారు. ఆ స‌మావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై అవ‌గాహ‌న కుదిరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇక టీఆర్ఎస్ ప‌రోక్ష మ‌ద్దతు నాగేశ్వర్‌కే అన్న క్లారిటీ టీఆర్ఎస్ శ్రేణుల‌కు వ‌చ్చేసిందట. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ సభ్యుడు రామచంద్రరావు మరోసారి బీజేపీ నుంచి బరిలో ఉండటంతో… ఇప్పుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version