ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బలీయంగా వ్యక్తం చేశాక కేసీఆర్ అంతే స్థాయిలో నాయకుడిగా ఎదిగారు.ముఖ్యంగా పార్టీ ఎదుగుదలకు కారణం అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు పూర్తిగా తెరదీశారు.అంతేకాదు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. అంటూ కొందరు మండిపడుతుంటే, వారికి ఇంకొందరు వత్తాసు పలుకుతున్నారు. పాలనను గాలికి వదిలి, విచ్చలవిడిగా నిధులు వెచ్చించిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపణలు వస్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం చలించడం లేదు.
ఈ నేపథ్యంలోజాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు, తనని తాను నిరూపించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని విపక్ష సభ్యులతో పాటు ఆయనంటే ఆగ్రహంతో ఊగిపోయే నేతలు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు.ఇదే కోవలో కేఏ పాల్ కూడా!
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని కేసీఆర్ అంటుంటే అందుకు భిన్నంగా ఎప్పుడూ విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి.విమర్శాస్త్రాలు సంధిస్తూనే ఉంటాయి.ఎందుకంటే కేసీఆర్ చేసింది తక్కువ మాట్లాడుతున్నది ఎక్కువ అన్న భావనలో విపక్షాలు ఉన్నాయి.ఇదే సమయంలో కేసీఆర్ చెప్పిన విధంగా తెలంగాణ అభివృద్ధి చెందలేదన్న భావనకు నిరూపణలు కూడా ఉన్నాయని మండిపడుతున్నారు విపక్ష నేతలు.ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ తరువాత కాలంలో ఎందుకు అప్పులు పాలయిందని ప్రశ్నిస్తూ,పోరాటాలకు ఊపిరి పోస్తున్నాయి.తాజాగా వీరి కోవలోనే మరో వ్యక్తి వచ్చి చేరారు. ఆయనే కేఏ పాల్.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రపంచ శాంతి పార్టీ అధినేత కేఏపాల్ తిడుతున్నాడు.ఆయన ఏర్పాటు చేయబోనున్న ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హైద్రాబాద్ లాంటి నగరం, ఆర్థికంగా బలోపేతంగా ఉన్న నగరం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని మండిపడుతున్నారు.తాను మోడీకి వ్యతిరేకంగా సభ పెడతానని,ఏప్రిల్ 9న నిర్వహిస్తానని,ఆ సభకు కేసీఆర్ ను ఆహ్వానిస్తే వస్తాడా అని సవాల్ విసిరారు. అదంతా పొలిటికల్ డ్రామాలో భాగం అని తేల్చేశారు.మరి వీటిపై తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ ఏ విధంగా ఉండనుందో ?