తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.రాష్ట్రానికి కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను అపాయింట్ చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, దీపాదాస్ మున్షీ మార్పునకు ఆమె మీద వచ్చిన అవినీతి ఆరోపణలే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే దీపాదాస్ మున్షీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అండగా నిలిచారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని, ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కొన్ని దిన పత్రికలు, ప్రసార మాద్యమాల్లో దీపాదాస్ మున్షీ పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తమని స్పష్టం చేశారు.ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.