Breaking : రేపు మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌..

-

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశవ్యాప్తంగా ఈ ఎన్నికపై ఆసక్తిగా నెలకొంది. జాతీయ రాజకీయాల్లో వెళ్లనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌, తాజాగా బీఆర్‌ఎస్‌ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. రేపు గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చండూర్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలిపారు.

చండూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గురువారం ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుండి చండూర్ వరకు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఉంటుందని వివరించారు. తెలంగాణపై కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు కక్ష కట్టారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం నేరమా..? రైతు బంధు ఇవ్వడం నేరమా? మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం నేరమా..? తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా కావాలని అడుగుతున్నారని మాపై కక్ష కట్టారా.. ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వేసే నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎంతోపాటు మా కార్యకర్తలు కూడా పాల్గొంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version