తెలంగాణ రాజకీయం వేడి వేడిగా మారింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆయన కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మద్య తోపులాట చేసుకున్నట్టు తెలుస్తుంది. తమ కార్యలయం పై దాడికి యత్నిస్తున్నారంటూ బీజేపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
తమ నాయకుడిపై పరుష పదజాలం వాడినందుకు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన తమపై బీజేపీ కార్యకర్తలే దాడికి దిగారంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. బీజేపీ ఎంపీ చేసే వ్యాఖ్యలు సరికావని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను విమర్శించేంత స్థాయి అరవింద్‌కి లేదని, గాలివాటంగా వచ్చిన గెలుపును చూసుకుని రెచ్చిపోతున్నారని విమర్శించారు.