ఏపీ బీజేపీలో మార్పులు జరిగాయా? అంటే..నాయకత్వ మార్పు కాదు.. నాయకుల నడవడికలో మార్పులు చోటు చేసుకున్నా యా? గతానికి భిన్నంగా బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీని వచ్చే ఎన్నికల్లో అంటే.. 2024 నాటికి ఏపీలో అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర కమలనాథులు నిర్ణయించుకున్నారు. కానీ, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన స్కెచ్ అయితే, రూపొందించుకోలేదు. అయితే, వారు ఎంచుకున్న మార్గం మాత్రం భిన్నంగా ఉంది. నిజానికి ఎవరైనా పార్టీని డెవలప్ చేసుకునేందుకు ప్రజలను నమ్ముకుంటున్నారు.(వైసీపీ విషయంలోను, టీడీపీ విషయంలోను ఇదే కదా జరిగింది). ప్రజల మధ్యకు వెళ్తారు. వారి గోడు వింటారు. వారిలో భరోసా కల్పిస్తారు.
కానీ, అదేం చిత్రమో.. బీజేపీలో ఎక్కడా అలాంటి పరిస్తితి మనకు ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీ నేతలు ఎక్కడా ఇల్లు దాటితే పార్టీ ఆఫీస్, లేదంటే.. ఇల్లు.. ఇలా వ్యవహరిస్తున్నారు. అయితే, వీరు నమ్ముకున్న అస్త్రం.. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చే నేతలేనట! వారి బలం చూసుకుని.. వచ్చే ఎన్నికలకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నామని.. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్ర మంలో పార్టీ కీలక నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోనీ.. కొద్ది సేపు.. ఇదే మంచిదని అనుకుందాం! కానీ, ఇలా ఒక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన నాయకులతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఈ దేశ చరిత్రలో ఉందా? పోనీ బీజేపీలో అయినా ఉందా? అంటే భూతద్దం పట్టుకుని వెతికినా.. కూడా కనిపించడం లేదు.
కానీ, ఏపీలో మాత్రం ఈ సూత్రం పాటిస్తారట. మరి ఈ నాయకులు.. ఒక్కసారి తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకుంటే బెటర్ కదా? అక్కడ అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులను కమలం గూటికి లాగేశారు. 2018 ఎన్నిక ల్లో తమదేగెలుపని, అధికారం తమ గూటికి పరిగెత్తుకుని వస్తుందని కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ, ఏం జరిగింది.. మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ముక్కీమూలిగీ అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఇది చూసిన తర్వాత కూడా ఏపీ కమల నాథుల మెద డు పనిచేయకపోవడం గమనార్హం. అసలు వాస్తవానికి చెప్పాలంటే.. ఇతర పార్టీల నుంచినేతలు ఎందుకు బయటకు వస్తారు? నిజంగానే వారికి ప్రజా బలం ఉంటే.. బయటకు రావాల్సిన అవసరం ఏముంటుంది? ఈ చిన్న లాజిక్ కూడా ఏపీ బీజేపీ నేతల మెదళ్లకు తట్టకపోవడం గమనార్హం.