అదేంటి ఓ ఇంటి పేరు ఎవరికి అయినా మంత్రి పదవిని దూరం చేస్తుందా ? అంటే తెలంగాణలో ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇప్పుడు ఇంటి పేరే శత్రువుగా మారింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు విద్యాసాగర్‌రావు. అంతకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బుగ్గారం నియోజకవర్గం స్థానం రద్దు కావడంతో కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు 2009 నుంచి పోటీ చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. 2009లో అప్పటి దేవాదాయ శాఖా మంత్రి జువ్వాది రత్నాకర్ రావుపై విజయం సాధించిన విద్యాసాగర్ రావు ఆ తర్వాత 2012 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు అవినీతి దూరంగా ఉండడం… అందరిని కలుపుకుని పోవడంతో ఆయనకు పార్టీ వర్గాల్లోనూ, స్థానికంగా మంచి పేరు ఉంది. నియోజకవర్గంలోనూ ఆయనకు తిరుగులేదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వార్ వన్‌సైడ్‌గానే ఉంటోంది. ఇంత సీనియార్టీ ఉన్నా.. మంచి పేరు ఉన్నా.. నాలుగు సార్లు గెలిచినా కూడా ఆయనకు ఇప్పటి వరకు కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి మాత్రం రావడం లేదు. ఇందుకు అనేక సమీకరణలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే నలుగురు మంత్రులు ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఇక విద్యాసాగర్ రావుకు మరో రెండు మైనస్‌లు కూడా ఉన్నాయి. ఆయన కేసీఆర్ సామాజిక వర్గం అయిన వెలమ వర్గానికి చెందిన వారు. ఇప్పటికే వెలమ కోటాలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, ఎర్రబెల్లి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అదే వర్గం నుంచి విద్యాసాగర్ రావు మంత్రి పదవి రావడం కష్టం. ఇక మరో కష్టం ఏంటంటే విద్యాసాగర్ రావు ఇంటిపేరు కల్వకుంట్ల కావడంతోనే మంత్రి పదవి దక్కడం లేదన్నదీ కూడా వాస్తవం. కేసీఆర్ ఇంటి పేరే ఆయన ఇంటి పేరు కావడంతో కల్వకుంట్లకు మరో పదవి అన్న విమర్శలు మరింత తీవ్రం అవుతాయి.. అందుకే ఆయన ఎంత సీనియర్ అయినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని అంటున్నారు.