అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం తాజ్ మహాల్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ఆయన తాజ్ మహాల్ వద్దకు వెళ్లి భార్య మెలానియా తో కలిసి గంట పాటు అక్కడ గడిపారు. ఈ సందర్భంగా ఆయన తాజ్ మహాల్ అందాలను వీక్షించారు. అక్కడ ఉన్న గైడ్ ఒకరు ట్రంప్ కి తాజ్ మహాల్ అందాలు, విశిష్టత గురించి ప్రత్యేకంగా వివరించడం గమనార్హం.
ట్రంప్ లోపల ఉన్నంత సేపు ఆయన పక్కనే ఉంటూ వివరించారు. ఇదిలా ఉంటే ట్రంప్ తాజ్ మహాల్ లో చూడాల్సింది చూడలేకపోయారు. దీనికి కారణం ఆయన ఎత్తు… తాజ్ మహల్‌లోని కీలకమైన ఒరిజినల్ సమాధి స్థలాన్ని చూడలేదు. ట్రంప్ ఎత్తు కారణంగా ఆయన లోపల పట్టరని భద్రతా సిబ్బంది చెప్పడంతో తన ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారు. ట్రంప్‌కు తాజ్‌మహల్ చూపించిన ప్రముఖ గైడ్ నితిన్ కుమార్ సింగ్ ఈ విషయ౦ వివరించారు.
తాజ్ మహల్ అందాలకు ట్రంప్ మంత్రముగ్దుడయ్యారన్నారు. అయితే మొఘల్ రాజు షాజహాన్, ఆయన సతీమణి ముంతాజ్‌ల అసలు సమాధులను మాత్రం ఆయన చూడలేకపోయారన్నారు. ఒరిజినల్ సమాధుల వద్దకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండడంతో ఆయన లోపలికి వెళితే గాయపడతారని భద్రతా సిబ్బంది కంగారుపడ్డారన్నారు. ట్రంప్ ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు.