దేవుడి ఆశీర్వాదం వల్లే తనకు కరోనా వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి తాను ముందుగానే అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. కరోనా సోకడంతో చికిత్స తీసుకున్న ట్రంప్ రెండు రోజుల క్రితం సైనిక ఆసుపత్రి నుంచి వైట్ హౌస్ కి తిరిగొచ్చారు. కరోనా సోకిన తర్వాత మిలిటరీ ఆసుపత్రిలో చేరానని, అక్కడ అత్యుత్తమ చికిత్సను పొందానని తెలిపారు ట్రంప్.
కరోనా సోకడం తనకు చాలా విషయాలు తెలిశాయని అయన అన్నారు. కరోనాకు వైద్యులు అందిస్తున్న చికిత్స ఎంత ఉత్తమమైనదో స్వయంగా తెలుసుకోగలిగానని తెలిపారు. ఓ అధ్యక్షుడిగా కొవిడ్ కు తాను ఎలాంటి చికిత్స అయితే తీసుకున్నానో అదే చికిత్సను అమెరికా ప్రజలకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు ట్రంప్. ఇక ఐసోలేషన్ నిబంధనలని లైట్ తీసుకున్న ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఆయన అధికారిక కార్యాలయానికి వెళ్లడాన్ని నెటిజన్లు తప్పు బడుతున్నారు.