అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి విషయంలో చైనాపై మరోమారు విరుచుకు పడ్డారు. ఇప్పటికే చైనాపై ప్రతి సమావేశంలోనూ ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ మరోసారి చైనాపై మాటలదాడికి దిగారు. ఈ సారి ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలే చేశారు.
కరోనా వైరస్ చైనా నుంచే వచ్చింది. వారు దాన్ని బయటకు రాకుండా ఆపి ఉండాల్సింది. దాన్ని సులభంగా అడ్డుకునే అవకాశం కూడా ఉంది. కానీ వారు దాన్ని ఆపలేదు. వారు కావాలనే.. బయటి ప్రపంచానికి కరోనా సోకాలని చెప్పే.. ఆ వైరస్‌ను ఆపలేదు. వారు సులభంగా దాన్ని ఆపి ఉండేవారు. కానీ అలా చేయలేదు. కరోనా చైనా నుంచి వచ్చిందని చెప్పడానికి మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వారు బయటి ప్రపంచానికి కరోనా సోకకుండా ఆపే శక్తి ఉన్నా ఆ పని చేయలేదు. కావాలనే వైరస్‌ను బయటకు వ్యాపింపజేశారు… అని ట్రంప్ అన్నారు.
చైనా కరోనాను ఇతర దేశాలకు వ్యాపింపజేస్తే.. తాము మాత్రం ఇతర దేశాలను రక్షిస్తున్నామని ట్రంప్ అన్నారు. తాము ఇతర దేశాలకు వెంటిలేటర్లను సరఫరా చేసి సహాయం చేస్తున్నామన్నారు. వేలాది వెంటిలేటర్లను అందిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిందంటే అందుకు చైనాయే కారణం అన్న నిజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.. అని ట్రంప్ అన్నారు.