అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ విజయం కోసం ఎంతో శ్రమించారు. ఎక్స్ వేదికగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం సైతం నిర్వహించారు. ఇక స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ‘ఎలక్షన్ గివ్ అవే’ కింద ప్రైజ్ మనీని ప్రకటించాడు. తాజాగా ఈ ప్రైజ్‌మనీ విషయంలో వివాదం చెలరేగింది. ముందుగా నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్‌మనీ ఇస్తున్నారని ఓ మహిళ మస్క్‌పై దావా వేశారు.
టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆరిజోనాలో నివాసముండే జాక్వెలిన్ మెక్‌అఫెర్జీ మస్క్ పై దావా వేశారు. మస్క్ ప్రవేశపెట్టిన స్కీంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు కాకుండా ముందుగానే నిర్ణయించిన వారికి ప్రైజ్‌మనీ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రైజ్ మనీ ప్రకటనతో ఆయా వ్యక్తుల వ్యక్తిగత వివరాల సేకరణ, తన సోషల్ మీడియాకు వ్యూయర్‌షిప్ పెంచుకోవడం, మస్క్ మద్దతుదారులకు లాభం చేకూరిందని ఆమె ఆరోపించారు. కాగా, ఆమె వాదనలను కోర్టు పట్టించుకోలేదని తెలుస్తోంది. కాగా, ఎన్నికలకు ముందు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘వాక్ స్వాతంత్ర్యం, ప్రతిఒక్కరికి గన్ కలిగి ఉండే రైట్’కు మద్దతుగా సంతకం చేసిన ఓటరుకు 100 డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.