ఇంజినీరింగ్‌ ఫీజులపై ఊరట.. TSAFRC గుడ్ న్యూస్

-

ఇంజినీరింగ్ ఫీజులను ఈ విద్యా సంవత్సరం పెంచకూడదని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ఇంజినీరింగ్​లో చేరనున్న విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు పాత ఫీజులే వర్తించనున్నట్లు వెల్లడించింది.

రానున్న మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ ఫీజులపై కొంతకాలంగా ఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. ఫీజులను పెంచాలని టీఎస్ఏఎఫ్ఆర్సీ మొదట భావించినప్పటికీ.. గత రెండేళ్ల కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాత రుసుములనే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, లా తదితర వృత్తి విద్య కోర్సులకు ఇదే విధానం కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంజినీరింగ్, ఆర్కిటెక్, ప్లానింగ్, లా, ఫార్మాలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, డీపెడ్ కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షించాల్సి ఉంటుంది. గత రుసుములను ఖరారు చేసిన మూడేళ్లయినందున.. రానున్న మూడేళ్ల కోసం గతేడాది నవంబరు 29న సమీక్ష ప్రక్రియను ప్రారంభించారు.

ఫీజులను సమీక్షించేందుకు 2020-21 విద్యా సంవత్సరం ఆదాయ, వ్యయ వివరాలను సమర్పించాలని వృత్తి విద్య కళాశాలలకు సూచించింది. కళాశాలల ఆదాయ, వ్యయాలు, ఇతర నివేదికలను ఏఎఫ్ఆర్సీకి సమర్పించాయి.

టీఎస్ఏఎఫ్ఆర్సీ మే16 నుంచి రోజుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలను పిలిపించి విచారణ ప్రక్రియ చేపట్టింది. ఫీజులను కనీసం 20శాతం నుంచి 75శాతం పెంచాలని వివిధ కళాశాలలు కోరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస రుసుము రూ.35 వేల ఉండగా గరిష్ఠగా రూ.లక్ష 34వేల వరకు ఉంది. కనీస రుసుము రూ.45వేలు… గరిష్ఠ ఫీజు రూ.లక్ష 45వేల వరకు పెంచాలని ఇటీవల టీఎస్ఏఎఫ్ఆర్సీ అభిప్రాయానికి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version