ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. ఇక ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.
బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది. మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.