తెలంగాలో నైట్ కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి కీలక ప్రకటన చేశారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ఉంటుందని అయితే ఆర్టీసీ బస్సులు యధాతధంగా నడుస్తాయని, ఆర్టీసీ బస్ టికెట్లు చూపించి ప్రయాణీకులు తమ తమ గమ్యాలను చేరుకోవచ్చని అన్నారు. రాత్రి 10 గంటల లోపు అన్ని బస్సులు డిపోకు చేరుకుంటాయన్న ఆయన రాత్రి కర్ఫ్యూ దృష్ట్యా బస్సుల ప్రయాణ సమయాన్ని కుదించామని అన్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సిటీ బస్సులు రాత్రి 9 గంటల లోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని, ఇతర జిల్లాలకు బయలుదేరాల్సిన బస్సులు 9 లోపు మాత్రమే బయలుదేరుతాయని అన్నారు. ఇతర జిల్లాలకు 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని 9లోపు వెళ్లేలా సమయపాలన ఆయా డిపో మేనేజర్లు చేసుకుంటారని అన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని అన్నారు.