మహారాష్ట్ర రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్స్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు జరుపుతున్నారు. ఎలాగైనా వారి భర్తల్నీ రాజీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. అలాగే ఉద్ధవ్ ఠాక్రే కూడా వారికి సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తెరవెనకాల రాజకీయాలు నడిపిన రష్మీ ఠాక్రే.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రేను సీఎం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాగే తన కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కేబినెట్ పదవిని కూడా పట్టుబడి సాధించుకుంది. దీంతోపాటు ఆమెకు పార్టీ కేడర్‌తో కూడా నేరుగా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. షిండే తిరుగుబాటు నేపథ్యంలో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గౌహతిలో ఉన్న 40 మంది రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.