రష్యా- ఉక్రెయిన్ మధ్య 12 వ రోజు కూడా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పలు ప్రపంచ దేశాల విజ్ఞప్తితో రష్యా మరోసారి కాల్పుల విమరణ ప్రకటించింది. ఉక్రెయిన్ కాలమాన ప్రకారం ఉదయం 7 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది. నిన్న ప్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ చేసిన విజ్ఞప్తితో రష్యా కాల్పుల విరమణ ప్రకటించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న నాలుగు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించింది. సుమి, ఖర్కీావ్, కీవ్, మరియోపోల్ నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఈ 4 నగరాల్లో రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. అక్కడ నుంచి విదేశీయులు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి ఉక్రెయిన్ సరిహద్దు దాటే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచ దేశాలు మానవతా కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యాని కోరతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో కూడా రెండు నగరాల్లో ఇలానే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం సుమీ ప్రాంతంలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ చెబుతోంది. ప్రస్తుతం కాల్పుల నిర్ణయంతో అక్కడి నుంచి భారతీయులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంది. పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి పోలాండ్, రొమేనియా దేశాలకు చేరుకోవచ్చు.