ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. హత్యకు గురైన అపార్ట్ మెంట్‌లో సీసీ టీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసులో ఊహించని మలుపు మళ్లింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 10:30 గంటలకు అపార్ట్ మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగనట్లు రికార్డులు బయటపడ్డాయి. నిన్న ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. అపార్ట్ మెంట్ వద్ద జరిగిన గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడి ప్రాణాలు పోయినట్లు వెల్లడించారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు అనంతబాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చినట్లు.. మళ్లీ ఒంటిగంటకు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాలో నమోదైంది.
మరోవైపు అనంతబాబు నివాసం ఉండే అపార్ట్ మెంట్ వాచ్‌మెన్ శ్రీను కూడా పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వాచ్‌మెన్ శ్రీను మాట్లాడుతూ.. ‘‘చనిపోయిన సుబ్రహ్మణ్యంకు నేను బాబాయిని అవుతాను. పుట్టిన రోజు వేడుకలు ఇక్కడ జరగలేదు. ఎస్పీ చెప్పినట్లు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. సుబ్రహ్మణ్యం తండ్రి నాకు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. అదే సమయంలో అనంతబాబు కంగారుగా బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్సీతోపాటు ఆయన భార్య కూడా ఉన్నారు. పోలీసులు ఎవరూ మా ఇంటికి రాలేదు.’’ అని ఆయన తెలిపారు.