కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 2020-21 సార్వత్రిక బడ్జెట్‌లో ఏపీ ఊసు కానీ, ఏపీ ధ్యాసకానీ ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలు ఏపీ ప్రజలను తీవ్రంగా బాధించాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అనేక రూపాల్లో కేంద్రం చేతల ద్వారా అయినా ఉపశమనం కలిగిస్తుందని గడిచిన ఆరేళ్లుగా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఇవ్వనంటున్న హోదా అంశాన్ని పక్కన పెట్టినా.. మిగిలిన విషయాల్లలో అయినా ఏపీకి ఊరట లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, నిన్న ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ ఒక్క విషయంలోనూ ఏపీకి ఊరట కలిగించే అంశం లేక పోవడంతో ప్రజలు నివ్వెర పోయారు.
2021నాటికి ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేసి తీరుతామని కేంద్రమే చెబుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్డెట్‌లో పైసా కూడా విదిలించలేదు. పోనీ.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాదాపు 5 వేల కోట్ల పైచిలుకు సొమ్మునైనా రీయింబర్స్ చేసే ప్రతిపాదన ఏదైనా ఉంటే బాగుండేదని నిపుణులు అంటున్నారు. ఈ రెండు విషయాలను బడ్జెట్‌లో విస్మరించారు. పోనీ.. నాబార్ద్ నుంచి నిధులు ఇప్పించే ప్రతిపాదనను కూడా కేంద్రం ప్రకటించలేదు.
విశాఖ మెట్రో కారిడార్, విశాఖ అభివృద్ధికి సంబందించిన ప్రాజెక్టులపై కూడా ఎలాంటి ఊసూ లేకుండానే బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అదేవిధంగావెనుక బడినజిల్లాల ఊసు కూడా లేదు. ఓవరాల్‌గా దేశంలోని అన్ని వెనుక బడిన జిల్లాలకు నిధులు కేటాయించినా.. ఈశాన్య రాష్ట్రాలకే ఎక్కువగా నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అక్షరాస్యత పెంపు, కొత్త రాజధానికి నిధుల విషయాన్ని కూడా బడ్జెట్ పట్టించుకోలేదు.
మరి ఇంత జరిగినా.. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏం చేసినట్టు? అనే ప్రశ్న అందరినీ కలిచి వేస్తోంది. రాజకీయాలు చేసుకోవడంలోనే టీడీపీ, వైసీపీలు తీరిక లేకుండా ఉన్నాయనే వాదనను ఈ బడ్జెట్ ప్రస్ఫుటంగా స్పష్టం చేసింది. ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో టీడీపీ కానీ, వైసీపీకానీ పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీకి జరిగిన అన్యాయం వెనుక ఈ రెండు పార్టీలదే పూర్తి బాధ్యత అంటున్నారు పరిశీలకులు.