ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కానీ భారత్‌లో మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు.
“మహమ్మారిపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించాం. ప్రపంచ దేశాల్లో కొవిడ్ విజృంభణను గమనిస్తున్నాము. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు సూచించాం. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ముందు జాగ్రత్తగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా టెస్టులు చేస్తాం.”–మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి