ఐక్యరాజ్య సమితి(ఐరాస) వ్యవసాయ విభాగం ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ (ఎఫ్‌ఏఓ)’ ఈ నెల 21 నుంచి 23 వరకూ ఇటలీ రాజధాని రోమ్‌లో ‘ప్రపంచ సృజనాత్మక సదస్సును నిర్వహిస్తోంది. భారత దేశంలో అత్యధిక విత్తన కంపెనీలు ఉన్నటువంటి తెలంగాణ గురించి ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించేందుకు సంస్థ అనుమతించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ…ఈ తరహా చర్చల కారణంగా తెలంగాణ నుంచి విత్తన ఎగుమతులకు పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల మీదా ప్రత్యేక దృశ్యాత్మక ప్రదర్శన ఇస్తామన్నారు. రైతుబంధుకు అవకాశమివ్వగా రైతుబీమా గురించి కూడా చెబుతామని అనుమతి తీసుకున్నట్లు పార్థసారథి వివరించారు. సదస్సుకు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. 23 వరకూ ఈ సదస్సులో పాల్గొని 26న జ్యూరిచ్‌లో అంతర్జాతీయ విత్తన పరీక్షల సంస్థ(ఇస్టా) సమావేశంలో పాల్గొంటామన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే…. ప్రపంచంలోని వివిధ రకాల సీడ్స్ కి …. తెలంగాణ కేంద్రం కానుంది.