అమరావతి: రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన మోదీ, అమిత్‌షాల నిరంకుశ పాలనకు జనసేన అధినేత పవన్ వంత పాడుతున్నారని మంత్రి, టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న చంద్రబాబుపై బురద జల్లడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పవన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఏపీకి రూ.75వేల కోట్లు రావాలన్న నిజనిర్ధారణ కమిటీ నివేదికపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి, అరవింద్‌ను గెలిపించుకోలేని పవన్.. 2014లో తెదేపాను గెలిపించానని అనడం సమంజసం కాదన్నారు. జగన్‌తో చర్చలు జరిపి 40 సీట్లు డిమాండ్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
నోట్ల రద్దు, జీఎస్టీ, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పవన్ తన ప్రసంగాల్లో పరుష పదజాలం ఉపయోగిస్తూ యువతకు ఏమి సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు. పోటీ చేసే స్థానంపై స్పష్టత లేకుండా రాజకీయాలు చేసి ఏం సాధిస్తారన్నారు. ఏసీ బోగీలో ప్రయాణం చేసి సామాన్య ప్రజలను ఏ విధంగా కలిశారో చెప్పాలని ఎద్దేవాచేశారు. సుప్రీంకోర్టు వ్యవహారంలో జోక్యం, గవర్నర్ వ్యవస్థల దుర్వినియోగం వంటి వారి గురించి మాట్లాడకుండా.. దుర్మార్గంపై పోరాడే రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయటమేనా మీ అజెండా? అని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు.