దేశంలోని కార్లు, టూవీలర్ యజమానులు ఇ20 పెట్రోల్‌ను వాడేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇ20 పెట్రోల్‌ను వాడేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా వాహనాల్లో వాడే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపుతారు. దీంతో అది ఇథనాల్ కలిసిన పెట్రోల్ అవుతుంది. దాన్నే ఇ20 పెట్రోల్ అంటారు. దీరి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
* ఇ20 పెట్రోల్‌ను వాడడం వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్ల శాతం తగ్గుతుంది. దీంతో కాలుష్యం ఉండదు. పర్యావరణానికి మేలు జరుగుతుంది.
* భారత దేశం పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధార పడడం తగ్గుతుంది. విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత్ తనకు కావల్సిన చమురు అవసరాల్లో 83 శాతం మేర చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇ20 పెట్రోల్‌ను వాడడం వల్ల ఆ శాతం ఇంకా తగ్గుతుంది. ఇతర దేశాలపై చమురు కోసం ఆధార పడాల్సిన అవసరం ఉండదు.
* ఇథనాల్ చెరుకు నుంచి వస్తుంది. దాన్ని ఎక్కువగా వాడుతారు కనుక చెరుకును పండించే రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. వారికి, చక్కెర ఉత్పత్తి చేసే మిల్లులకు ఆదాయం పెరుగుతుంది.
* నిత్యం పెరిగే పెట్రోల్ ధరల నుంచి సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలుగుతుంది.
అయితే 2014 నుంచే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడుతున్నారు. కానీ పెట్రోల్‌లో దాన్ని 1 శాతం మాత్రమే కలిపారు. అయితే ప్రస్తుతం దాని శాతాన్ని 20కి పెంచారు. దీంతో ఇ20 పెట్రోల్‌ను వాడాలని కేంద్రం సూచిస్తోంది. అయితే కార్లు, టూవీలర్లలో ఏయే మోడల్స్‌కు చెందిన వాహనాల్లో ఇ20 పెట్రోల్‌ను వాడవచ్చో ఉత్పత్తిదారులు వినియోగదారులకు చెప్పాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వాహనాలపై స్టిక్కర్లను వేయాలి. దీంతో వాహనదారులు తమ వాహనాల్లో ఇ20 పెట్రోల్‌ను నింపుకుని వాడేందుకు అవకాశం ఉంటుంది.