నలభైలోకి వచ్చాక చర్మంలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారడం మొదలవుతుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చర్మం పొడిబారితే దాని వయస్సు పెరుగుతున్నట్టు లెక్క. అందుకే చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
పొడిబారిన చర్మంపై ముడుతలు ఏర్పడి మరింత చికాకుని కలిగిస్తాయి. అదొక్కటే కాదు వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై మచ్చలు, ముడుతలు, సాధారణంగా వస్తుంటాయి. వీటి నుండి దూరంగా ఉండి చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో మాయిశ్చరైజర్ ఒకటి. మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమగా చేస్తుంది. అందుకే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. అలాగే బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ లేపనం చేసుకోవాలి. బయటకి వెళ్లే పదిహేను నిమిషాల ముందే లోషన్ లేపనం చేసుకోవడం మంచిది. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలని అడ్డుకుని చర్మాన్ని తేమగా ఉంచడంలో సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది.
కేవలం బయటకి వెళ్తున్నప్పుడే కాదు కంప్యూటర్ ముందు కూర్చునే వారు కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడడం మంచిది. కంప్యూటర్ సాధనాల నుండి వెలువడే నీలికాంతి చర్మానికి హాని కలుగజేస్తుంది. సో.. జింక్ ఆక్సైడ్ గల సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది.
కావాల్సినన్ని నీళ్ళు తాగాలి, ఆహారంలో కూరగాయలతో పాటు పండ్లు ఉండేలా చూసుకోండి. చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇవి బాగా ఉపయోగపడతాయి.
ఇంకా ఆహారంలో విటమిన్ సి, విటమిన్ ఏ సరైన రీతిలో తీసుకోండి. దానివల్ల చర్మం తేమగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. మరో విషయం రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని నైట్ క్రీమ్ పెట్టుకుని పడుకుంటే చర్మం పొడిబారడం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.