తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వెనుక కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ‘క్లౌడ్ బరస్ట్’ వల్లే ఇంతటి భారీ వర్షపాతం నమోదై ఉండొచ్చని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. “తెలంగాణలో వర్షాలు, వరదలకు అంతర్జాతీయ కుట్రలు కారణమా?… కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు” అంటూ విమర్శించారు. క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న ప్రాంతాల్లోనే వీలుపడుతుందని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరదల వెనుకు విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ కు ఈటల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లు ఉందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే ఒక అర్థం ఉండాలని, వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే.. వర్షాలను కురిపించి అక్కడి ప్రజలను చంపుకోదు కదా అని ఆయన ప్రశ్నించారు.