దారుణం.. హెల్మెట్ పెట్టుకోలేద‌ని బైక్ తాళాల‌ను నుదుటి లోప‌లికి గుచ్చారు..!

-

ఉత్త‌రాఖండ్ పోలీసులు ఓ ద్విచక్ర వాహ‌న‌దారుడి ప‌ట్ల అత్యంత హేయంగా ప్ర‌వ‌ర్తించారు. హెల్మెట్ పెట్టుకోలేద‌ని చెప్పి అత‌ని బైక్ కీస్ తీసుకుని వాటిని అత‌ని నుదుటి లోప‌లికి బ‌లంగా గుచ్చారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌గా స్థానికులు స్పందించి ఆ వ్య‌క్తిని హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అనంత‌రం స‌ద‌రు పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ అక్క‌డి ఎమ్మెల్యేతో క‌లిసి పోలీస్ స్టేష‌న్‌పై రాళ్లు రువ్వారు.

ఉత్త‌రాఖండ్‌లోని ఉధ‌మ్ సింగ్ న‌గ‌ర్ జిల్లా రుద్ర‌పూర్ సిటీలో సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్నాడు. దీంతో అత‌న్ని ఆపిన అక్క‌డి సిటీ పెట్రోల్ యూనిట్ (సీపీయూ) పోలీసులు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేద‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తికి పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గురై ఆ వ్య‌క్తి బైక్ కీస్ తీసుకుని వాటిని అతని నుదుటిలోకి బ‌లంగా గుచ్చారు. దీంతో ఆ వ్య‌క్తి ఒక్క‌సారిగా తీవ్ర ర‌క్త‌స్రావానికి గుర‌య్యాడు.

విష‌యం తెలుసుకున్న స్థానికులు అత‌న్ని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అనంత‌రం అక్క‌డి ఎమ్మెల్యేతో క‌లిసి వారు రుద్ర‌పూర్ పోలీస్ స్టేష‌న్ ఎదుట బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. పోలీసులు స్పందించ‌క‌పోయే స‌రికి వారిపై రాళ్లు విసిరారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకుని ఆందోళ‌న‌కారుల‌కు స‌ర్ది చెప్పారు. స‌ద‌రు అమానుష ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన పోలీసుల‌ను స‌స్పెండ్ చేసి వారిపై విచార‌ణ చేప‌డతామ‌ని హామీ ఇవ్వ‌డంతో స్థానికులు అక్క‌డి నుంచి వెనుదిరిగారు. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version