తిరుపతి ఎన్నికల్లో వకీల్ సాబ్ సినిమా విపక్షాలకు కొత్త అస్త్రంగా మారింది. సినిమా ప్రదర్శనలను..టిక్కెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని బీజేపీ- జనసేన ఆరోపణలు..టీడీపీ సన్నాయి నొక్కులు ఇలా తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో వకీల్ సాబ్ సినిమా ఒక అంశంగా మారింది. ఇక దీనికి వైసీపీ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. టిక్కెట్ రేట్లు పెంచి ప్రజలకు వినోదం దూరం చేస్తారా అంటూ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది.
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో..పార్టీలు తముకున్న అస్త్రాలన్నింటిని ప్రయోగిస్తున్నాయి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ పై రాజకీయ రచ్చ మొదలైంది. బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వ కుట్రగా బీజేపీ,జనసేన వివాదన్ని మొదలు పెట్టాయి. మరో వైపు టికెట్ ధరలు పెంచనివ్వక పోవడం పైనా నానా రచ్చ చేశారు జనసేనాని అభిమానులు. తద్వారా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రభుత్వ చర్యను తప్పు పట్టాలన్నది బీజేపీ, జనసేన నేతల ఉద్దేశ్యం.
వకీల్ సాబ్ సినిమా విషయంలో ఆత్మరక్షణలో పడిందన్న వ్యాఖ్యలకు చెక్ పెడుతూ ఎటాక్ ప్రారంభించి అధికార పార్టీ. టికెట్ ధరలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా మంచిదో వివరిస్తూ ఎదురుదాడి చేసింది. సామాన్యులు సినిమా థియేటర్ కు వెళ్లి చూసే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. హీరోలు రెమ్యునషన్ కోసం కోట్లు తీసుకోవడం వల్లనే టికెట్ రేట్లు పెరుగుతున్నాయని మంత్రి అనిల్ మంటలు రాజేశారు. సినిమా టికెట్ రేట్ల వివాదాన్ని ప్రస్తావిస్తూ..తమ రెమ్యునేషన్ ఎందుకు తగ్గించుకోరంటూ ప్రశ్నించారు.
వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. పవన్ అభిమానులు, సినిమా టికెట్ ధరల వివాదం పక్కన పెడితే రెండింతలు అవుతున్న ధరలు భారంగా మారుతున్నాయి. దీని పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై సానుకూలత వ్యక్తం అవుతోంది. పవన్ సినిమా వరకే దీని చూడాల్సిన పని లేదని..ఇది పూర్తి స్థాయి పాలసీ మేటర్ అంటోంది ప్రభుత్వం. ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమంటూ సినిమా రచ్చపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.
మొత్తానికి వకీల్ సాబ్ విషయంలో ముందు కాస్త ఇబ్బంది పడిన వైసీపీ ఇప్పుడు పక్కా లెక్కలతో సినిమా వివాదానికి చరమగీతం పాడింది.