గత కొద్దిరోజులుగా టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే …ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో సుమారు అరగంట పాటు చర్చించినట్లు సమాచారం. అయితే వంశీ వెంట మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూడా ఉన్నారు. ఈ భేటీ కంటే ముందు వంశీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరీతో కూడా సమావేశమయ్యారు. ఇక సుజనాని కలిసిన వెంటనే వంశీ జగన్ తో భేటీ కావడం విశేషం. ఆయన పార్టీ మారేందుకు జగన్ ని కలిసినట్లు తెలుస్తోంది.
అయితే రెండో సారి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ….టీడీపీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఏదో నియోజకవర్గంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ తాజాగా వంశీపై పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంచారని కేసు నమోదైంది. అది కూడా ఎన్నికల కోడ్ సమయంలోనే పంచారని తెల్సింది.
దీంతో ఈ కేసు రుజువైతే వంశీ జైలుకు వెళ్లడంతో పాటు, పదవి కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకే వంశీ వైసీపీలోకి జంప్ చేస్తే ఏ సమస్య ఉండదని భావించినట్లు తెలిసింది. దీనిపై నియోజకవర్గంలోనే కార్యకర్తలు, నేతలతో కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ తో భేటీ అయ్యి పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కేసుల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక వంశీ పార్టీ మార్పు దాదాపు ఖాయమైందని, అధికారికంగా చెప్పడమే మిగిలినట్లు తెలుస్తోంది.