విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో జరిగినటువంటి మైనర్ బాలిక పై అత్యాచారం యత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వై.సి.పి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లల పై అత్యాచారాలు పెరిగిపోయాయని.. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని విమర్శించారు.
ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు. రోజురోజుకీ ఆడపిల్ల ల పై అత్యాచారాలు జరుగుతుంటే తాడేపల్లి లో నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నారని.. మన రాష్ట్రానికి హోమ్ శాఖ మాత్యులు సూచరిత ఆడపిల్లల అత్యాచారాల పై నోరు మెదపకుండా ఉండటం దురదృష్టకరమని ఆగ్రహించారు.
ఒకవేళ బయటకు వస్తే ఈ ప్రభుత్వం తరపున ఆడపిల్లల మానం కు 5 లక్షలు ,ప్రాణం కు 10 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొంటారని మండిపడ్డారు. అమలు లో లేని దిశా చట్టం గురించి పబ్లిసిటీ చేసుకోవడం తగదని.. ఆడపిల్లల కు న్యాయం చేయలేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హోమ్ మంత్రి సుచరితలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.