ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు బయలుదేరనున్న సంగతి తెలిసిందే. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకునే ఆయన, నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని గతంలో సీఎం జగన్ అన్నారని, ఇప్పుడు పోలీసులు ఆయనకు ఆత్మీయులయ్యారా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిట్‌పై కూడా నమ్మకం లేదన్న జగన్.. సీఎం అయ్యాక సిట్ ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.
వివేకానంద హత్యకేసులో గతంలో సీబీఐ విచారణ కోరింది నిజం కాదా? అని జగన్‌ను ప్రశ్నించిన వర్ల రామయ్య ఇప్పుడెందుకు విచారణలో జాప్యం చేస్తున్నారని నిలదీశారు. ‘సీఎం జగన్ హైదరాబాద్ రహస్య పర్యటనలకు కారణాలేంటీ? హఠాత్తుగా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? రిట్ పిటిషన్‌లో వివేకానంద కుమార్తె సునీత కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోదరి సునీతను కలిసి రిట్ పిటిషన్‌పై ప్రశ్నించడానికి వెళ్తున్నారా?’ అని ప్రశ్నించారు. ‘లేదంటే ఆ పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారా? రిట్ పిటిషన్‌లో సునీత అనుమానితుల జాబితా ఇచ్చారు. సీబీఐ విచారణకు వెళ్తే వాస్తవాలు బయటకు వస్తాయని భయమా? ఎవరిని అరెస్టు చేస్తారని ఆయన భయపడుతున్నారు’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.