మరోసారి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు దోపిడీలో భాగస్వాములైన వారు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ అంటూ వెళ్తూ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు గారు, ఆయన కుమారుడి దోపిడీలో భాగస్వాములైన మాజీ మంత్రులు, మాజీ అధికారులు, బినామీల ముందస్తు బెయిళ్లు, స్క్వాష్ పిటిషన్లతో ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు కోర్టుల సమయాన్ని హరిస్తున్నారు. మీరు నిజంగా నిర్దోషులైతే దర్యాప్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడొచ్చు కదా.’ అని ట్వీట్‌లో ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ లపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యథా తండ్రి.. తథా కొడుకు అని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ఏ14గా ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో లాయర్లతో లోకేశ్ భేటీ అవుతున్నారని… వారికి ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే స్కీమ్ ను ఆఫర్ చేస్తున్నారని అన్నారు. తండ్రి కేసును తీసుకుంటే, కొడుకు కేసు ఉచితమని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకుల ఆట ముగిసిందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయి కామెంట్ చేశారు.