పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచుగా విమర్శనాస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ అవార్డు అంశాన్ని ఉపయోగించుకుని సెటైర్ వేశారు.
పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రాగానే అందులో తాను ఉన్నానంటూ చంద్రబాబు బిల్డప్ కొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి X(ట్విటర్)లో విమర్శించారు. ‘పుష్ప చిత్రంలోని ఓ సీన్లో గోడకు వేలాడుతూ నా ఫోటో ఉంది. అందుకే అవార్డు వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అవును.. ఆయన హయాంలో ఎర్రచందనం విచ్చలవిడిగా స్మగుల్ అయింది. అందుకే పోలీస్టేషన్లో ఆయన ఫోటో పెట్టారని ప్రజలు అంటున్నారు’ అని సెటైర్లు వేశారు.
ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ పచ్చ మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని, మరి ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని పేర్కొన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని ఆయన ప్రశ్నించారు.