కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీగా అవినీతి పెరిగిపోయిందని ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు అక్రమంగా ఇసుకను లారీల్లో తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. అనంతరం ఇసుక తరలిస్తున్న వారితో గొడవకు దిగినట్లు సమాచారం.
కాగా, మంజీరా పరీవాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుకను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. పేరుకే టీజీఎండీసీ క్వారీలను మూసివేసినట్లుగా కలరింగ్ ఇస్తూ రాత్రయితే చాలు ఎత్తివేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరుల దందా ఉన్నదని, అందుకే రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. ఉన్న అనుమతులు రద్దు చేసి జీరో దందాకు తెర లేపిందని విమర్శలొస్తున్నాయి.