విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేమంటే విశాఖ ఉక్కుకి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీఐ కార్యకర్త రమేష్ చంద్ర వర్మకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. వార్షిక బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఈ సంస్థ సమీప భవిష్యత్తులో లాభాలు గడిస్తుందని ఆర్ఐఎన్ఎల్ వెల్లడించింది.
2015-20 మధ్యకాలంలో పేరుకుపోయిన నష్టాలు, చెల్లించాల్సిన పన్నులు మినహాయించిన తర్వాత కూడా లాభాలు వస్తాయి అని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. దీంతో లాభాలు వచ్చే అవకాశమున్నా స్టీల్ ప్లాంటును కేంద్రం అమ్మకానికి పెట్టినట్లు అయింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.