ఎమ్మెల్యే ఉన్నా ఆ నియోజజవర్గంలో వైసీపీ ఎందుకు వెనకబడింది ?

-

స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు అన్ని జిల్లాల్లో ఏకపక్ష విజయాలు సాధించిన అధికార వైసీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. జిల్లా మొత్తం స్పీప్ చేద్దామనుకున్న విజయనగరం జిల్లాలోని ‌ ఓ నియోజకవర్గంలో గట్టిపోటి ఎదురైంది. సార్వత్రిక‌ ఎన్నికల్లో‌ ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీకి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం మాత్రం చెమటలు పట్టించింది. నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే ఉన్నా అధికారపార్టీకి మాత్రం ఇక్కడ టెన్షన్ తప్పడం లేదు.

విజయనగరం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఏ ఎన్నిక వచ్చినా ఏకపక్షవిజయాలు సాధించింది అధికార వైసీపీ. బొబ్బిలిలో మాత్రం టీడీపీ నుంచి గట్టి పోటి ఎదురైంది. బొబ్బిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావును ఓడించి ఎమ్మెల్యే అయ్యారు మరో సీనియర్‌ నాయకుడు శంభంగి వెంకట చిన అప్పలనాయుడు. అలా గెలిచిన సంతోషం మొన్నటి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేకు ఆవిరైందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

2014 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి సుజయ్‌ కృష్ణ రంగారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరి.. మంత్రి అయ్యారు. బొబ్బిలి రాజులు పార్టీ మారిన తర్వాత నియోజకవర్గంలో మరో నేత కోసం వెతికిన వైసీపీకి..టీడీపీ, కాంగ్రెస్‌లలో పనిచేసిన సీనియర్ నేత శంభంగి కనిపించారు. దీంతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్నారు. సుజయ్‌పై శంభంగి సంచలన విజయం సాధించారు. మంత్రి కాలేకపోయినా ప్రొటెం స్పీకర్‌గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

అయితే బొబ్బిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంభంగి 20 నెలలు గడుస్తున్న పట్టు సాధించలేకపోయారు. బొబ్బిలి టీడీపీ ఇంఛార్జ్‌గా సుజయ్‌ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బేబినాయన ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కాపాడుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఆ ఎఫెక్ట్‌ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపించింది. 110 పంచాయతీలలో 40కి పైగా టీడీపీ మద్దతుదారులు గెలిచారు.

పంచాయతీ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఇంకాస్త గట్టిగా ఎఫర్ట్ పెట్టింది. పార్టీ సీనియర్లంతా బొబ్బిలి పైనే దృష్టి పెట్టారు. మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్ని తామై నడిపించారు. అయినా 31 వార్డుల్లో 11 టీడీపీ గెలుపొందింది. ఈ ఫలితాలు తర్వాత జిల్లా వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఇదే పరిస్థితి నియోజకవర్గంలో ఉంటే ఎమ్మెల్యేకి,పార్టీకి గడ్డు రోజులే అన్న చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version