“నాలో విషయం ఉంది.. నా సినిమాలో కూడా విషయం ఉంది. నన్నెవ్వరూ జాకీలు పెట్టి
లేపనక్కర్లే ” అని గతంలో పలుమార్లు చెప్పాడు మాస్ కా బాప్ విశ్వక్ సేన్. ఈ కుర్ర హీరో ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఆ తరువాత అవి సంచలనం అయ్యాయి. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారడం మంచి విషయమే ! కానీ అదే అదునుగా పబ్లిక్ లో అతి చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం అన్నది ఎంత వరకూ సమంజసం అన్నది ఇవాళ ఓ అడ్వకేట్ ఆయన్ను ఉద్దేశిస్తూ సంధిస్తున్న ప్రశ్న.
తెలంగాణ నుంచి వచ్చిన హీరోలలో మంచి భవిష్యత్ ఉన్న నటుడిగా ఆయనకు పేరు ఉంది. దానిని చెడగొట్టుకోవద్దు అని కూడా కొందరు విశ్వక్ కు హితవు చెబుతున్నారు. విజయవంతం అయిన సినిమాలు 4 మంచి మాటలకు కేరాఫ్ అవుతాయో లేదో కానీ మంచి మాటలు మాత్రం మంచి జీవితాలకు కేరాఫ్ అవ్వగలవు.
అతి చేయవద్దు గతి చెడిందని బాధపడవద్దు..ఇదీ ఇవాళ పబ్లిసిటి స్టంట్స్ విషయంలో వస్తున్న వాదన. ఈ కోవలోనే విశ్వక్ ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా త్వరలో విడుదల కు సిద్ధం అవుతున్న నేపథ్యాన ఓ ప్రాంక్ వీడియో చేయించి వదిలాడు. అదే ఇప్పుడు అతడిని కొత్త వివాదంలో ఇరుక్కుపోయేలా చేసింది. ఓ ప్రముఖ న్యాయవాది ఆయనపై కేసు ఫైల్ చేస్తానని అంటున్నారు. ఆ వివరం ఈ కథనంలో…
పబ్లిక్ లో కొన్ని తిక్క పనులు చేయడంతో ఇటీవల కాలంలో ఓ ఫ్యాషన్. ఆ విధంగా సినిమాకు ఓ హైప్ తీసుకుని రావాలని భావించడం ఇప్పుడు అందరికీ తెలిసిన తిక్క. ఏదేమయితేనేం తిక్క అనంది లేదా నెగిటివ్ పబ్లిసిటీ అనండి లేదా పిచ్చి వేషాలు అనండి .. ఈ విధంగా ఏదో ఒకటి ఇటీవల కాలంలో వికృతాలు ఎక్కువ అవుతున్నాయి. సినిమాను ప్రమోట్ చేసుకోవడం తప్పు కాదు కానీ ప్రాంక్ వీడియోల పేరిట పబ్లిక్ లో నానా రభస చేయడం ఇప్పుడీ విషయం కోర్టు మెట్లు ఎక్కుతుండడం విశేషం.
దీనిపై ప్రముఖ అడ్వకేట్ అరుణ్ కుమార్ స్పందించి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను సంప్రదించనున్నారు. దీనిపై త్వరలో కేసు కూడా ఫైల్ కానుంది.
రద్దీగా ఉండే హైద్రాబాద్ వీధుల్లో నిన్నటి వేళ ఓ యువకుడు నేను చచ్చిపోతా నాకు 33 ఏళ్లు వచ్చినా పెళ్లికావడం లేదు అంటూ పెట్రోలు డబ్బా పట్టుకుని నానా హంగామా చేశాడు. దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. విశ్వక్ ఆ దారి మీదుగా వెళ్తూ ఆ కుర్రాడిని ఊరడించే ప్రయత్నం చేశాడు. తరువాత కొంత దూరం వెళ్లాక మళ్లీ ఆ కుర్రాడు అతి చేస్తూ ఆయన బండి కింద పడ్డాడు. ఇది కూడా వీడియోలో రికార్డు అయింది.
ఆ తరువాత ఆ కుర్రాడిన తాను వచ్చిన వాహనంలో ఎక్కంచి, విశ్వక్ అక్కడి నుంచి ఓ ఆటోలో వెళ్లిపోయాడు. ఆఖరికి ఈ సీన్ చూసిన వారంతా ఇదొక ప్రాంక్ వీడయో అని తెలిసి తిట్టుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు న్యాయ స్థానం ఏ విధంగా స్పందిస్తుందో అన్నది చూడాలి. గతంలోనూ కొందరు కుర్రాళ్ల అతి కారణంగానే సినిమా ప్రమోషన్లు చాలా అంటే చాలా జుగుప్సగా తయారయ్యాయి. వాటికి కొనసాగింపే ఈ ప్రాంక్ కాల్స్ కానీ లేదా ప్రాంక్ వీడియోలు కానీ.. !