వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా ‘లైట్స్ ఆఫ్’ నిరసన కార్యక్రమానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఆయన ప్రజలను అదే రోజు రాత్రి 9 గంటలకు 15 నిమిషాల పాటు ఇళ్లలో , వాణిజ్య సముదాయాల్లో లైట్లు ఆపి శాంతియుత నిరసన తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ చర్య అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలలో భాగం. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బోర్డు ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇటీవల హైదరాబాద్‌లో ‘వక్ఫ్‌ను రక్షించండి – రాజ్యాంగాన్ని కాపాడండి’ పేరిట మజ్లిస్ మద్దతుతో నిర్వహించిన సభ విజయవంతమవడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపొస్తోంది.

జూలై 13న ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో నిర్వహించబోయే బహిరంగ సభతో ఈ ఉద్యమం ముగియనుంది. అంతవరకూ చట్టంపై అవగాహన పెంచేలా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు జరపాలని ఏఐఎంపీఎల్‌బీ నిర్ణయించింది. అన్ని కార్యక్రమాలు శాంతియుతంగా, క్రమశిక్షణతో జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీధి ప్రదర్శనలు చేయకూడదని, అక్కడ పరిస్థితుల అనుకూలత లేకపోవచ్చు కాబట్టి నిరసనలు శాంతియుత మార్గాల్లోనే కొనసాగించాలని బోర్డు అధికార ప్రతినిధి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ తెలిపారు.