వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్, వారికి విశేషమైన బాధ్యతలు అప్పగించారు. “జిల్లాల్లో మీరే పార్టీ, మీరే నేతలు” అంటూ స్పష్టం చేసిన ఆయన—ప్రజా సమస్యలపై స్పందిస్తూ, స్థానికంగా ఉద్యమాలు నిర్వహించాల్సిందిగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డ జగన్.. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతోందని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విధ్వంసమే సాగుతోందని, రైతులు మద్దతు ధరల లభ్యత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలపై జిల్లా అధ్యక్షులు మద్దతుగా నిలవాలని, ప్రజల్లోకి వాటిని స్పష్టంగా తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఏడాదిలోపే వ్యతిరేకత పెరిగిందని జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే కమిటీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిలతో కలసి ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజాసంబంధిత విషయాల్లో ప్రత్యక్షంగా స్పందించాలని జగన్ హితవు పలికారు. మే నెలలో మండల కమిటీలు, జూన్-జులైలో గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీలు, ఆగస్టు-అక్టోబరులో బూత్ కమిటీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధికారంలోకి రావాలంటే భారం మోయడం అవసరమేనని, ప్రతి జిల్లా అధ్యక్షుడు తన జిల్లాలో పార్టీని ప్రభావవంతంగా నడిపించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.