ఏపీలో గత కొద్ది రోజులుగా మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరు టీడీపీని, చంద్రబాబును, లోకేష్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ అటు వంశీ, ఇటు కొడాలి నాని ఇద్దరు బాబును దబిడి దిబిడి ఆడేసుకుంటున్నారు. ఇక తాజాగా ఏపీలో ఉల్లి కొరత అసెంబ్లీని తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని ప్రాధినిత్యం వహిస్తోన్న గుడివాడలో మల్లిఖార్జున్ రెడ్డి అనే వ్యక్తి రైతు బజార్ దగ్గర ఉల్లిపాయలు తీసుకోవడానికి క్యూలో నిలబడి… గుండెపోటుతో చనిపోయాడంటూ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు.
దీంతో సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని ప్రాథినిత్యం వహిస్తోన్న గుడివాడ లోనే పరిస్థితి ఇలా ఉందంటే ? ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ? అని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే టిడిపి ప్రభుత్వం తన నియోజకవర్గంలో వ్యక్తి చనిపోతే చేస్తున్న ఈ ప్రచారానికి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఆ చనిపోయిన వ్యక్తి చాలా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి… టిడిపి వాళ్ళు ఆ వ్యక్తి ఉల్లిపాయల కోసం నిలబడి గుండెపోటుతో చనిపోయాడు అని శివ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు శవ రాజకీయం చేయడం అలవాటే అని… ఆయనకు దొరక్క దొరక్క ఓ శవం దొరికితే నీచ రాజకీయాలు చేస్తున్నాడంటూ నాని మండిపడ్డారు.
ఇక ఆ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో వీడియో రూపంలో ప్లే చేసి చూపించారు. ఆ వీడియో లో చనిపోయిన మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులు తమను రాజకీయాల్లోకి లాగవద్దని మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందిస్తూ కావాలనే కొన్ని మీడియా ఛానెల్స్, పత్రికలు చనిపోయిన వ్యక్తి పై సైతం రాజకీయం చేస్తున్నాయని…. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే నాని చంద్రబాబుకు అదిరిపోయే సవాల్ కూడా విసిరారు. రాజకీయాలు చేయడానికి గుడివాడ తెలుగుదేశం పార్టీ జాగీరు కాదని… అక్కడ కొడాలి నాని అనే వ్యక్తి ఉన్నాడు అన్న విషయం బాబు గుర్తు పెట్టుకోవాలని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.