సావిత్రి బాయి పూలే ఆశయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె 194వ జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సావిత్రి బాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, అణగారిన వర్గాల ఉన్నతికి పాటుపడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలను కొనియాడారు.
పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు పూలే పునాది వేశారని, లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రి బాయి ఆశయ సాధనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.