కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ లో రహదారుల నిర్మాణం పై కీలక ప్రకటన చేశారు. 2024 లోపే ఉత్తర ప్రదేశ్ లో రోడ్లను అమెరికాలో రహదారుల కంటే గొప్పగా నిర్మిస్తామని అన్నారు. లక్నోలో జరిగిన ” ఇండియన్ రోడ్డు కాంగ్రెస్” సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కి ₹7,000 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు.
యూపీలోని రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. మంచి రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం దగ్గర నిధులకు ఏమాత్రం కొరత లేదన్నారు. యూపీలో కొనసాగుతున్న రహదారుల ప్రాజెక్టులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఘట్కరి సమీక్ష నిర్వహించారు. పట్టణాలలో రవాణాకు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని యోగి సర్కారును ఘట్కరి కోరారు.