మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రాన్ని ఆకర్షిస్తున్న టాపిక్. ఈ ఎన్నికలో గెలవాలని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మునుగోడు పోరులో పైచేయి సాధించాలని చూస్తున్నాయి. సరే మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో గెలుపు ఎవరిది అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.
అయితే గెలుపోటముల విషయం పక్కన పెడితే…మునుగోడు ఉపఎన్నిక అనేది వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసేలా ప్రధాన పార్టీలు వ్యవహరించాయని చెప్పొచ్చు. అసలు బీసీలు ఎక్కువగా ఉండే మునుగోడు సీటుని మూడు పార్టీలు రెడ్డి వర్గానికే ఇచ్చాయి. మునుగోడులో చాలా తక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి వర్గానికి మూడు పార్టీలు సీటు కేటాయించడం బట్టి చూస్తే..బీసీ వర్గాలకు ప్రాధాన్యత అనేది పెద్దగా కనిపించడం లేదు. వాస్తవానికి తెలంగాణ అనేది బీసీల కోట. తెలంగాణలో బీసీలే పెద్ద సంఖ్యలో ఉంటారు..ఆ తర్వాత ఎస్సీలు ఉంటారు.
అయినా సరే ప్రధాన పార్టీలు బీసీలకు అనుకున్నంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. రెడ్డి, వెలమ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సరే రాష్ట్రం వదిలేసి..మునుగోడు చూసుకుంటే. ఇక్కడ 2.25 లక్షల ఓటర్లు ఉంటే..అందులో సగం బీసీ ఓటర్లే ఉన్నారు. కానీ అభ్యర్ధులు మాత్రంర్ రెడ్లు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
అంటే పోటీ చేసేది రెడ్లు..గెలిపించేది బీసీలు. అయితే ఈ సారి బీసీలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా? లేక యథావిధిగానే తమ తమ పార్టీలపై అభిమానం చూపించుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా బీసీల కోటగా మునుగోడులో రెడ్డి అభ్యర్ధులు పోటీ చేయడం అనేది సమంజసం కాదనే చెప్పాలి. మరి చూడాలి మునుగోడు ప్రజలు ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారో.