కొడంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కలెక్టర్‌పై దాడి అమానుషమని, దాడి చేసిన వాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ దాడిని ప్రోత్సహించిన బీఆర్ఎస్ నాయకులు, ఇందులో ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టబోమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌తో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, దాడికి పాల్పడిన వారు కేటీఆర్‌తో సైతం ఫోన్ ద్వారా టచ్‌లోనే ఉన్నారని, పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయొచ్చని, కానీ కలెక్టర్‌పై దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని సూచించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే బీఆర్ఎస్ వాళ్లంతా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు.